Satyanveshana
Chapters
విమర్శకావతంస, కావ్యతత్త్వశారద శ్రీ విన్నకోట మాధవరావుగారి సన్మాన సమయమున సమర్పించిన పద్యసుమాంజలి ఆంధ్ర సాహిత్య వైశిష్ట్యమరసి యంత తృప్తినందక నందలి దీప్తినెల్ల ఆంధ్రజనులకు చవులూర నందజేయ కంకణము దాల్చినాడవో ఘన యశస్వి. వినుతికెక్కిన గ్రంధాల వివరణమున వానియందలి రసభావ వైభవముల తేటతెల్లంబుగా మాకు దెలియజేయ మేము ముదితాత్ములై తిమో మిత్రవర్య. కావ్యజాలంపుతత్త్వంబు కవుల హృదయ భావ సౌభాగ్య గరిమను బాహ్యపఱచి మదికి హత్తంగ మేలి విమర్శజేసి ఖ్యాతిగాంచితివి విమర్శకావతంస. చల్లనైనట్టి నిండు జాబిల్లినుండి జలజలనురాలు అమృతంబుజాలు లీల రసము తొణికిసలాడు నీ రచనలందు రమ్యగుణసాంద్ర మాధవరాయ సుకవి. జ్ఞానదీపిక వెలయించి జనులకెల్ల సత్యమార్గంబుజూపు సంస్తుత్యచరిత ఆయురారోగ్య సంపదలలర మిమ్ము సచ్చిదానంద బ్రహ్మంబు సాకుగాత. ఇట్లు, N. రామారావు, M, A., B.Ed., Sainic School, Korukonda.